వందలాది మంది లిబియా తిరుగుబాటుదారులు ఐదు గంటల పాటు పోరాటం తర్వాత మంగళవారం రాజధాని ట్రిపోలీలోని నియంత ముయమ్మార్ గడాఫీకి చెందిన బాబా అల్ అజీజియా కాంపౌండ్‌లోకి గోడలు బద్దలుకొట్టుకొని ప్రవేశించారు. ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్న రెబెల్స్ విజయసూచికగా గాల్లోకి కాల్పులు జరిపారు.
42 సంవత్సరాలుగా లిబియాను పాలిస్తున్న గడాఫీ ఈ కాంపౌండ్ కేంద్రంగానే తన అధికారాన్ని నిర్వహిస్తున్నారు. రెండు మిలియన్ల జనాభా ఉన్న ట్రిపోలీలోని అధిక భాగాన్ని ఆదివారం రాత్రికి రెబెల్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. తాము గడాఫీ కోసం వెదుకుతున్నట్లు తిరుగుబాటుదారులు చెప్పారు. అయితే గడాఫీ ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు.
కాంపౌండ్ వెలుపల ఉన్న గడాఫీ విగ్రహాన్ని కూల్చివేసిన రెబెల్స్ కాళ్లతో తొక్కారు. ఈ విగ్రహాన్ని 1986లో ఏర్పాటు చేశారు. గడాఫీ ఈ కాంపౌండ్‌లోని బాల్కనీ నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. మార్చి నుంచి బాబ్ అల్ అజీజియాపై నాటో అనేకమార్లు వైమానిక దాడులు జరిపింది.