తాలిబాన్ తీవ్రవాదులు సానుభూతిపరుల నుంచే ఎక్కువ నిధులు పొందుతున్నారని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్న రిచర్డ్ హోల్‌బ్రూక్ చెప్పారు. తాలిబాన్లకు ఆఫ్ఘనిస్థాన్ అక్రమ డ్రగ్ వ్యాపారం కంటే విదేశాల్లోని సానుభూతిపరుల నుంచే ఎక్కువ నిధులు అందుతున్నాయని తెలిపారు.
దీనిని నిరోధించేందుకు అమెరికా ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టిందని వివరించారు. ఇదిలా ఉంటే తాలిబాన్ తీవ్రవాద గ్రూపుకు ధనిక ప్రాంతమైన గల్ఫ్ నుంచి ఎక్కువగా నిధులు వస్తున్నాయని, వారి కార్యకలాపాలకు పశ్చిమ యూరప్‌తో సహా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా డబ్బు అందుతోందని వెల్లడించారు.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ వ్యతిరేక చర్యల పురోగతిని మంగళవారం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ అధికారులకు హోల్‌బ్రూక్ వివరించారు.
పాకిస్థాన్ సైన్యం ఆ దేశంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులతో జరుపుతున్న పోరాటం కారణంగా నిరాశ్రయులైన సాధారణ పౌరులకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాటానికి కూడా ఈ ప్రాంతం చాలా కీలకమని హోల్‌బ్రూక్ పేర్కొన్నారు.