సిగరెట్ తయారీ సంస్థలను నియంత్రించేందుకు ప్రభుత్వానికి విశేష అధికారాలు కట్టబెట్టే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. తాను అమెరికాలో తేవాలనుకున్న మార్పుల్లో ఇది కూడా ఒకటని బిల్లుపై సంతకం చేసిన సందర్భంగా బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.
బరాక్ ఒబామా కూడా ఒకప్పుడు ధూమపాన ప్రియుడే కావడం గమనార్హం. ఈ అలవాటును విడిచిపెట్టడం ఎంత కష్టమో ఆయన కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దేశంలో ప్రతి రోజూ 18 ఏళ్లకన్నా తక్కువ వయస్సు గల 1000 మంది పిల్లలు పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారు.
ఆ వయస్సులోనే తాను కూడా ధూమపానం కోరల్లో చిక్కుకున్నానని బరాక్ ఒబామా తెలిపారు. ఎంతో కాలం మనతోనే ఉన్న సిగరెట్‌ను వదిలిపెట్టడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసని పేర్కొన్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఏ కారణం లేకుండా పొగతాగడం మొదలు పెడుతున్నారని నేను భావించడం లేదు.
పొగాకు సంస్థలు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఒబామా అభిప్రాయపడ్డారు. బరాక్ ఒబామా తాజాగా సంతకం చేసిన పొగాకు చట్టం కింద పిల్లలు నివసించే ప్రదేశాలు, చదువుకునే ప్రదేశాలు, ఆడుకునే ప్రదేశాల్లో పొగాకు సంస్థల ఉత్పత్తుల ప్రచారాన్ని అడ్డుకుంటారు.
అమెరికా ఆహార, డ్రగ్ పాలనా యంత్రాంగానికి (ఎఫ్‌డీఏ)కి ఈ చట్టం కింద పలు అధికారులు దఖలుపడతాయి. కొన్ని పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తారు. యువతను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు ఉండేలా చూస్తారు.