చిలీ దేశంలో స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ వ్యాధి బారిన పడిన 18 సంవత్సరాల యువకుడు తాజాగా మరణించినట్టు చిలీ ప్రభుత్వ వైద్యాధికారులు వెల్లడించారు. మృతుడిని చిలీ దేశ రాజధాని శాంటియాగోకు 915 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ప్రాంతమైన పౌర్టో మాంట్‌కు చెందిన నెల్సన్ మల్డోనాడోగా గుర్తించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
దీనిపై స్థానిక వైద్యాధికారి ఈజెనియా స్నకే మాట్లాడుతూ, మల్డోనాడోకు వ్యాధి సోకిన తర్వాత పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. దీంతో అతని ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మృత్యువాత పడినట్టు చెప్పారు. అసలే చలికాలం కావడంతో చిలీలో స్వైన్ ఫ్లూ వ్యాధికి చికిత్స చేయడం మరింత కష్టతరంగా మారిందన్నారు.
ఈ స్వైన్ ఫ్లూ ధాటికి చిలీ దేశంలో ఇప్పటి వరకు 4,315 కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, గత బుధవారం అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది. స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా మరిన్ని అధికారాలను మంజూరు చేసింది.
కాగా, ఈ వ్యాధి సోకిన రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఏ ఒక్కరినీ ఆస్పత్రిలో చేర్చలేదని, అయితే, ప్రతి ఒక్కరికీ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్టు చిలీ ఆరోగ్య సహాయ మంత్రి నాన్సీ ప్రెజ్ వెల్లడించారు.