తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో సైన్యం చేపట్టిన ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అహ్మద్ ముఖ్తార్ వెల్లడించారు. తాలిబాన్లు, ఇతర తీవ్రవాదులతో స్వాత్ లోయలో సైనికులు చేస్తున్న యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్నారు.
భద్రతా దళాలు వాటికి అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేశాయని, తీవ్రవాదులను తుడిచిపెట్టడం ద్వారా ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకుందని ముఖ్తార్ చెప్పారు. తీవ్రవాదులు తిరిగి స్వాత్ లోయలోకి అడుగుపెట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
తాలిబాన్లు- పాకిస్థాన్ సైన్యం మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రాణభయంతో.. నివాసాలు వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వేలాది మంది పౌరులు జూన్ 20నాటికి తిరిగి వెళ్లవచ్చని మంత్రి తెలిపారు. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ బైతుల్లా మెహసూద్‌ను వేటాడేందుకు పాకిస్థాన్ సైన్యం రంగం సిద్ధం చేస్తుందన్నారు.
గత 24 గంటల్లో మలకాండ్ డివిజన్‌లో పాక్ భద్రతా దళాలు గాలింపు చర్యల్లో భాగంగా మరో 34 మంది తాలిబాన్ తీవ్రవాదులను హతమార్చాయి. కాబల్ ప్రాంతాన్ని పూర్తిగా ఆర్మీ హస్తగతం చేసుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఏడుగురు తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకుంది.