వాయువ్య పాకిస్థాన్‌లో సోమవారం ఒక ప్రొవిన్షియల్ మంత్రి కాన్వాయ్‌పై తాలిబాన్ తీవ్రవాదులు జరిపిన దాడిలో మంత్రితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఖైబర్-పఖ్తున్ఖవా ప్రావిన్స్ విద్యామంత్రి సర్దార్ బాబక్ హుస్సేన్ కారుపై బ్యూనర్ జిల్లాలో గత రాత్రి దాడి చేసిన తీవ్రవాదులు కాల్పులు కూడా జరిపారు. గాయపడ్డ మంత్రిని హాస్పిటల్‌కు తరలించారు. అవామీ నేషనల్ పార్టీ సీనియర్ నాయకుడైన బాబక్ చేయి, భుజానికి గాయమైంది. గత కొన్ని సంవత్సరాలుగా తాలిబాన్లు అవామీ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు.
తీవ్రవాదుల దాడులు, తెగల మధ్య కలహాలతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతున్నది. కొన్ని నెలలుగా పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో తెగల మధ్య జరుగుతున్న హింసలో వందలాది మంది మృత్యువాత పడ్డారు.