ఇరాన్ అత్యంత శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ అధిపతి అయతుల్లా అలీ ఖమేనీ ఇటీవల దేశంలో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు న్యాయబద్ధత ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. తాజా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న డిమాండ్‌లను తోసిపుచ్చారు.
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని ఖమేనీ ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష బాధ్యతలకు అహ్మదీనెజాద్ వరుసగా రెండోసారి ఎన్నికయిన సంగతి తెలిసిందే. అహ్మదీనెజాద్ ఎన్నిక న్యాయబద్ధంగానే జరిగిందని, ఈ ఎన్నికలను రద్దు చేయాల్సిన అవసరం లేదని ఖమేనీ స్పష్టం చేశారు.
గత శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అహ్మదీనెజాద్ తన ప్రత్యర్థులపై తిరుగులేని విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిందని, వాస్తవానికే తానే విజేతనని అహ్మదీనెజాద్ ప్రధాన ప్రత్యర్థి మీర్ హుస్సేన్ మౌసావీ వాదిస్తున్నారు. మౌసావీకి మద్దతుగా వేలాది మంది నిరసనకారులు గత కొన్ని రోజులుగా ఇరాన్‌లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారి ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను నిలిపివేయాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు వారి ఫిర్యాదులకు సంబంధిత వ్యవస్థల ద్వారా సమాధానం రాబట్టుకోవాలని సూచించారు. దేశంలో పెద్దఎత్తున జరుగుతున్న నిరసనకార్యక్రమాలు అశాంతికి దారితీస్తాయని, దానికి నిరసనకారులే బాధ్యులవతారని పేర్కొన్నారు.
1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసనలు వెల్లవెత్తడం ఇదే తొలిసారి. తాజా ఎన్నికల ఫలితాలపై ఖమేనీ మాట్లాడుతూ... అధికారిక ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు అహ్మదీనెజాద్ విజయం సాధించినట్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు.
ప్రతిపక్ష సభ్యులు రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నారు. అయితే అహ్మదీనెజాద్‌కు సమీప ప్రత్యర్థికి మధ్య 11 మిలియన్ ఓట్ల తేడా ఉంది. 11 మిలియన్ ఓట్లు ఎలా రిగ్గింగ్ చేయబడతాయని ఖమేనీ ప్రశ్నించారు. ఇరాన్ బాహ్య శత్రువు గ్రేట్ బ్రిటన్ దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.