పాక్‌లోనే ఒసామా ఉన్నాడు: అమెరికా

ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే తలదాచుకుని ఉన్నాడని అమెరికా తెలిపింది.

ఒసామా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నాడని పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గెరాల్డ్ ఎమ్. ఫియర్‌స్టీన్ తెలిపారు. ఒసామా చనిపోలేదని, అతను జీవించే ఉన్నాడని ఆయన తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్-ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోనున్న పట్టీ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడని ఆయన వివరించారు.

ఒసామా గతంలోలాగా అల్‌ఖైదా తీవ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించలేకపోతున్నారని, కాని తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాద కార్యకర్తలకు లాడెన్ ప్రేరణనిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.

ఆఫ్గనిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలకు కేంద్రబిందువైన బలూచిస్థాన్ రాజధాని క్వేటాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, ఈ విషయమై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు.

క్వేటాలోనున్న ఉగ్రవాద అగ్రనాయకుల్లో ముల్లా ఉమర్‌ కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాలిబన్లకు చెందిన శూరా ప్రాంతంలో తాలిబన్లు వివిధ పథకాలను రచిస్తున్నారని, అమెరికాలో అలాగే ఆఫ్గనిస్థాన్‌లో ఆఫ్గన్ సైనికులపై దాడులకు పాల్పడేందుకు వారు ప్రణాళికలు రూపొందించుకుంటన్నట్లు తమ వద్ద సమాచారం వుందని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి