ఫ్రాన్స్‌లో బుర్ఖాను అనుమతించం: సర్కోజీ

ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడాన్ని ఫ్రాన్స్‌లో అనుమతించమని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ పేర్కొన్నారు. బుర్ఖా మతచిహ్నం కాదని, ముస్లిం మహిళలకు ఇదొక నిబంధన మాత్రమేనని వ్యాఖ్యానించారు. తమ దేశంలో ఇటువంటి నిబంధనలు అనుమతించమని, మహిళలను ఖైదీలుగా ఉండనివ్వమన్నారు.

బుర్ఖా మహిళల పరాధీనతకు చిహ్నమని పేర్కొన్నారు. ముస్లిం ఆచారాలపై సర్కోజీ చేసిన వ్యాఖ్యలు ముస్లిం ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. తమ దేశంలో మహిళలు ఖైదీల్లో బుర్ఖాల వెనుక మగ్గిపోవడానికి అంగీకరించమని సర్కోజీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఫ్రాన్స్‌లో అన్నిమతాల్లాగే ముస్లిం మతానికి సమాన గౌరవం ఇవ్వాలని సర్కోజీ చెప్పారు.

పశ్చిమ దేశాలంటేనే అగ్గిమీదగుగ్గిలమయ్యే ముస్లిం ప్రపంచం సర్కోజీ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఆయన తాజాగా చట్టసభ సభ్యులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిన యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్‌లోనే ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి