బ్రిటన్ ఆసక్తి ముగ్ధురాలిని చేసింది: రాష్ట్రపతి ప్రతిభా

సోమవారం, 2 నవంబరు 2009 (09:29 IST)
భారత్‌తో మరింతగా దగ్గరి సంబంధాలు నెరపేందుకు బ్రిటన్ ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి తనను ఎంతో ముగ్ధురాలిని చేసిందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అన్నారు. ఆ దేశ రాణి ఎలిజబెత్ సైతం భారత్-బ్రిటన్ మైత్రిని అపూర్వమైనదిగా అభివర్ణించారని ఆమె గుర్తు చేశారు.

బ్రిటన్, సైప్రస్ దేశాల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆదివారం స్వదేశానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో తనతో పాటు ఉన్న మీడియాతో ఆమె కొద్దిసేపు మాట్లాడారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత్‌-బ్రిటన్‌ సంబంధాలకు తన పర్యటన మరింత ఊపునిచ్చిందన్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలు, పరస్పర ఆసక్తికరమైన అంశాలపై తాను బ్రిటన్‌ నేతలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లు ఆమె వివరించారు.

ముఖ్యంగా, బ్రిటన్‌లో ఉన్న మహాత్ముని గుర్తులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు పలువురు కృషి చేశారన్నారు. ఫలితంగా ఈ వస్తువులు భారత్‌కు తీసుకుని వచ్చామన్నారు. వీటిని తాను అందుకున్నప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యానన్నారు.

అలాగే, సైప్రస్‌ పర్యటన గురించి వివరిస్తూ అక్కడి పార్లమెంట్‌ ముంగిట మహాత్ముని విగ్రహాన్ని చూసినపుడు, అక్కడి భారత హైకమిషనర్‌ కార్యాలయం ఉన్న వీధికి ఇందిరాగాంధీ పేరు పెట్టటాన్ని గమనించినపుడు తాను వింత అనుభూతికి లోనయ్యానన్నారు. కాగా, బ్రిటన్‌లో 20 ఏళ్ల తర్వాత భారత్‌కు చెందిన అత్యున్నత స్థాయి పౌరప్రతినిధిగా పాటిల్‌ పర్యటించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి