బ్రిటీష్ విమానాశ్రయంలో బాడీ స్కానర్

ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండటంతో తొలిసారిగా లండన్‌లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో బాడీ స్కానర్‌ను విమానాశ్రయాధికారులు ఏర్పాటు చేశారు.

తీవ్రవాదులనుంచి ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో బ్రిటన్ దేశంలోని మాంచెస్టర్ విమానాశ్రయంలో బాడీ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణీకులు ధరించిన దుస్తుల్లో దాగివున్న పేలుడు పదార్థాలు లేదా ఆయుధాలేమైనా ఉంటే అవి స్పష్టంగా కనపడుతాయి.

తాము విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌రే మిషన్ స్కానర్‌ను ట్రైల్ కోసం పరీక్షించామని ఇందులో ప్రయాణీకుని శరీర భాగాలు కూడా కనపడుతాయని అధికారులు తెలిపారు.

స్కానర్ కలిగిన బూత్‌లో ప్రయాణీకులు నిలబడినప్పుడు స్కానర్‌లోనున్న ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్ ద్వారా నగ్నంగా మూడు కోణాలలో వారి శరీరం కనపడుతుందని, దీనిని ఎనభై వేల పౌండ్లు ఖర్చుపెట్టి తయారు చేసారని అధికారులు పేర్కొన్నారు.

ఈ స్కానర్‌ను రాపి స్కాన్ సిస్టమ్ సంస్థ రూపొందించిందని, ప్రయాణీకులు తమ కోట్లు, షూస్ లేదా బెల్ట్‌లను తొలగించలేనివారికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా తాము స్కాన్ చేసిన తర్వాత అందులోని చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోను భద్రపరిచే వీలు కలగదని లేదా వాటిని మళ్ళీ ఫోటో ప్రింట్ చేసుకునే వీలుండదని, దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని అధికారులు వివరించారు.

కాగా తరచూ విమానయానం చేసే ప్రయాణీకులు ప్రతి సంవత్సరం ఐదు వేల సార్లు ఈ స్కానర్‌ గుండా బయటకు వెళ్ళవచ్చని, దీంతో ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి