ఆస్ట్రేలియాలో గత ఏడాది 54 మంది విదేశీ విద్యార్థులు మృతి చెందారని, వీరిలో సగం మంది భారతీయులని వచ్చిన వార్తలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆస్ట్రేలియాలో గత ఏడాది 54 విదేశీ విద్యార్థులు మృతి చెందినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మరణవార్తలకు సంబంధించి వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, ఇవి సరైన గణాంకాలు కావని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
విదేశీ విద్యార్థుల భద్రతను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం త్వరితగతిన చర్యలు అమలు చేస్తుందని న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా దౌత్యకార్యాలయం వెల్లడించింది. ఆస్ట్రేలియా పత్రికల్లో బుధవారం ప్రచురితమైన వార్తల్లో అంతర్జాతీయ విద్యార్థుల నేరసంబంధ మరణాలపై సరైన గణాంకాలు లేవని దౌత్యకార్యాలయం తెలిపింది.
ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ విద్యార్థుల మరణాలకు సంబంధించిన వివరాలు సమర్పించబడ్డాయి. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్, సిటిజన్‌షిప్ (డీఐఏసీ) వద్ద ఉన్న వివరాలే ఇందులో పొందుపరిచారు. డీఐఏసీ వద్ద ఉన్న రికార్డుల్లో అన్నిరకాల మరణాలు (ప్రమాదాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో సంభవించిన మరణాలు) ఉన్నాయని ఆస్ట్రేలియా దౌత్యకార్యాలయం వివరణ ఇచ్చింది.
డీఐఏసీ పూర్తిగా ఇతరులు పౌరుల మరణాలకు సంబంధించి ఇచ్చిన సమాచారంతో రికార్డులు రూపొందిస్తుంది. మరణాల సంఖ్యను ధృవీకరించేందుకు, లేదా అంతర్జాతీయ విద్యార్థుల మరణాలకు కారణాలు గుర్తించేందుకు డీఐఏసీ రికార్డులను ప్రాతిపదికగా ఉపయోగించరని ఆస్ట్రేలియా దౌత్యకార్యలయం తెలిపింది.