భారత కోళ్ల ఉత్పత్తులపై ఒమన్ నిషేధం ఎత్తివేత

ఒమన్ ప్రభుత్వం ఎట్టకేలకు భారత కోళ్ల ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసింది. గత ఏడాది భారత్‌లో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో ఒమన్ ప్రభుత్వం కోళ్ల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించింది. అనంతరం భారత ప్రభుత్వం ఈ నిషేధం ఎత్తివేతపై ఒమన్ అధికారిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.

తాజాగా ఒమన్ వ్యవసాయ శాఖ భారత్ నుంచి దిగుమతి చేసుకునే కోళ్ల ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసినట్లు గురువారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. భారత్‌లో గత ఏడాది రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రబలింది. అయితే అన్ని రాష్ట్రాల నుంచి కోళ్ల ఉత్పత్తుల దిగుమతిపై ఒమన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి దిగుమతులు నిలిపివేయడం బావ్యంకాదని ఒమన్ అధికారిక యంత్రాంగానికి భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన పక్షులను తాము వధించామని, తద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టినట్లు భారత ప్రభుత్వం ఒమన్‌కు తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి