మూడు దశాబ్దాల ఎమర్జెన్సీ చట్టాలను తొలగించిన శ్రీలంక
శుక్రవారం, 26 ఆగస్టు 2011 (10:24 IST)
తమిళ వేర్పాటువాద ఉద్యమాన్ని ఆయుధాలతో ఎదుర్కోవడానికి సుమారు మూడు దశాబ్దాల క్రితం విధించిన క్రూరమైన అత్యవసర చట్టాలను తొలగిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే గురువారం ప్రకటించారు.
"దేశంలో అత్యవసర చట్టాల అవసరం లేనందుకు తాను సంతృప్తి చెందుతున్నాను" అని అధ్యక్షుడు మహీంద రాజపక్సే పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. 28 సంవత్సరాల క్రితం విధించబడిన ఈ చట్టాలతో భద్రతా దళాలకు అరెస్ట్, నిర్భంధించే అధికారం ఏర్పడుతుంది. రాజపక్సే ప్రకటన ప్రకారం ఈ నిబంధనలకు ఆగస్ట్ ఆఖరుతో కాలం చెల్లనున్నప్పటికీ తీవ్రవాద నిరోధక చట్టం క్రింద అధికారులకు ఇదేవిధమైన గట్టి అధికారాలు అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రతిపక్ష నాయకుడు రణిల్ విక్రమసింఘే 2009 మేలో సైన్యం తమిళ టైగర్లపై తుది విజయం పొందిన అనంతరం ఈ చట్టాలను తొలగించడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో శ్రీలంక మానవహక్కుల పరిస్థితిపై చర్చించే అవకాశం ఉన్నందున దానికి ముందుగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.