యెమెనియా విమానం బ్లాక్ బాక్స్ గుర్తింపు

కొమరో ద్వీపాలకు సమీపంలో హిందూ మహాసముద్రంలో కూలిపోయిన యెమెనియా విమానానికి చెందిన ఓ బ్లాక్ బాక్సును గుర్తించినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ విమానం బ్లాక్ బాక్సును వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. విమానంలోని బ్లాక్ బాక్స్ రికార్డర్లలో ఒకదానిని మంగళవారం సాయంత్రం గుర్తించినట్లు ఫ్రాన్స్ మంత్రి ఒకరు తెలిపారు.

ఈ బ్లాక్‌బాక్స్‌ను గ్రాండ్ కొమరో ద్వీపానికి 40 మైళ్ల దూరంలో గుర్తించారు. ఫ్రెంచ్ నౌక బుధవారం ఈ ప్రదేశానికి చేరుకొని బ్లాక్ బాక్స్‌ను వెలికితీయనుంది. మంగళవారం యెమెన్ ప్రభుత్వ పౌర విమానయాన సంస్థ "యెమెనియా" విమానం ఒకటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హిందూ మహాసముద్రంలో కూలిపోయింది.

కూలిపోయిన ఎయిర్‌బస్ ఏ310 విమానంలో మొత్తం 153 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 14 ఏళ్ల బాలికను మాత్రమే సహాయక బృందాలు ప్రాణాలతో రక్షించాయి. మిగిలినవారందరూ మృతి చెంది ఉంటారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

ప్రయాణికుల్లో 66 మంది ఫ్రాన్స్ పౌరులు కూడా ఉన్నారు. మిగిలినవారిలోనూ ఎక్కువమంది ఫ్రాన్స్‌లో స్థిరపడిన కొమరో ద్వీపాల పౌరులు ఉన్నారు. విమాన శకలాలు, మృతదేహాల గాలింపు చర్యల్లో ఫ్రెంచ్ మిలిటరీ విమానం, రెండు యుద్ధ నౌకలు, జోడియాక్ ఫాస్ట్ బోట్లు పాల్గొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి