యెమెన్: వైమానిక దాడుల్లో 30 మంది తీవ్రవాదుల హతం

గురువారం, 25 ఆగస్టు 2011 (10:48 IST)
దక్షిణ యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న 30 మంది తీవ్రవాదులు హతమయినట్లు మిలిటరీ, మెడికల్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల్లో ఎనిమిది మంది సైనికులు కూడా చనిపోయారు.

అబయాన్ ప్రావిన్స్ రాజధాని జింజిబార్‌కు సమీపంలో మిలిటెంట్ల లక్ష్యంగా బుధవారం దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రవాదులకు పెనుదెబ్బ అయిన ఈ దాడిలో మరో 40 మంది తీవ్రవాదులు గాయపడినట్లు కూడా వారు తెలిపారు. జింజిబార్‌కు సమీపంలోని దుఫాస్ ప్రాంతంలో ఎనిమిది మంది సైనికులు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.

దక్షిణ యెమెన్‌లోని జింజిబార్‌తో పాటు పలు పట్టణాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ దళాలు భూతల, వైమానిక దాడులతో వారిని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నాయి. మధ్యప్రాశ్చ దేశమైన యెమెన్‌లో అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సలేహ్ వైదొలగాలని ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి