లిబియా రాజధాని ట్రిపోలీకి తిరుగుబాటుదళాలు ప్రవేశించాయి. ఆ వెంటనే ఆ నగరం బాంబు పేలుళ్లు, తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. లిబియా అధ్యక్షుడు మహ్మద్ గడాఫీ పాలనకు చివరి రోజులని, ఆరు నెలల యుద్ధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని తిరుగుబాటుదళాలు ప్రకటించాయి. మరోవైరు తిరుగుబాటుదారులకు లొంగిపోయే ప్రసక్తే లేదని, తిరుగుబాటుదళాల దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్టు లిబియా అధ్యక్షుడు గడాఫీ ప్రకటించారు.
రాజధానిలోకి ప్రవేశించిన వారిపై తమ దళాలు దాడిచేసి మట్టుబెట్టాయని తెలిపారు. వైమానిక దాడులు జరుగుతున్నాయని చెప్పారు. లిబియాలో తిరుగుబాటు విజయవంతం కాదని, లిబియన్లు ఎప్పటికీ లొంగిపోరని గడాఫీ తనయుడు సైఫ్ అల్ ఇస్లాం ప్రకటించారు. ఇది తమ సొంత దేశమని, ఈ దేశంపై తమకు సర్వహక్కులు ఉన్నాయని, అందువల్ల లిబియాను వదిలి వీడే ప్రసక్తే లేదని తెల్చి చెప్పాయి.
ఇదిలావుండగా, ట్రిపోలీకి పశ్చిమ శివారు నగరమైన జవియాను వారం రోజుల క్రితం తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో రాజధానికి మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గడాఫీపై ఒత్తిడి మరింత పెరిగింది. జవియాను స్వాధీనం చేసుకునేందుకు గడాఫీ సేనలు తీవ్రంగా పోరాడుతున్నాయి.