నిషేధిత జమాదుత్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ పఙీజ్ మొహమ్మద్ సయీద్‌ను అరెస్టు చేయలేమని పాకిస్థాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడులకు సయీద్ ప్రధాని సూత్రధారి అని భారత్ విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ దాడుల్లో అతని ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలు తమ వద్ద లేవని, అందువలన సయీద్‌ను అరెస్టు చేయలేమని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు. ముంబయి ఉగ్రవాద దాడుల్లో సయీద్ ప్రమేయం ఉందని వెలువడిన ప్రకటనలను ఆధారంగా చేసుకొని అరెస్టు చేయడం సాధ్యపడదని చెప్పారు.
అతని ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలు తమకు అందజేయాలని భారత ప్రభుత్వాన్ని కోరామని మాలిక్ వెల్లడించారు. ప్రస్తుతానికి హఫీజ్ సయీద్‌కు ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందనేందుకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అతని ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలు ఉంటే వాటిని తమకు అందజేయాలని భారత ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆధారాలేవైనా ఉంటే వాటిని తమకు పంపాలని, అనవసర ప్రచారం చేయవద్దని మాలిక్ జియో వార్తాఛానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. ముంబయి దాడుల సూత్రధారులపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. అయితే పుకార్లను నమ్మి తమ పౌరుడిని అరెస్టు చేయలేమని స్పష్టం చేశారు.