జీ-20 దేశాల ఐదవ శిఖరాగ్ర సదస్సుకు రంగం సిద్ధమైంది. ఈ సమావేశాలకు దక్షిణ కొరియాలోని సియోల్ వేదిక కానుంది. ఈ సదస్సును గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యుంగ్ బాక్ ప్రారంభించారు. ఈ 20 దేశాల గ్రూప్ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనేందుకై భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం సియోల్ చేరుకోగా, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా ఇండొనేషియా రాజధాని జకార్తా నుంచి నిర్ణీత సమయానికి ముందే సియోల్ చేరుకున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్తులు, మంద్యాన్ని నివారించేందుకు మార్గాంతరాలను అన్వేషించడం వంటి అంశాలపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చిస్తారు. కాగా.. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇలా సమావేశం కావడం ఈ సంవత్సరంలో ఇది రెండోసారి. ఈ సమావేశాలలో భాగంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌లతో కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ కానున్నారు. ఆస్ట్రేలియా తొలి మహిళా ప్రధాని జూలియా గిల్లార్డ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. స్వేచ్ఛా, సుస్థిర, పాలనా ప్రాతిపదికతో కూడిన అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం ఉండాలని అన్నారు. ఈ జీ-20 సదస్సుకు మన్మోహన్ సింగ్‌తో పాటు సియోల్ చేరుకున్న బృందంలో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా కూడా ఉన్నారు.