సౌదీ అరేబియా, ఇరాన్‌లకు మధ్యవర్తిగా పాక్ అధ్యక్షుడు
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నిర్ధిష్ట ప్రణాళికతో తీవ్ర అస్థిరత నెలకొన్న మధ్యప్రాశ్చంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. "జర్దారీ ఆ ప్రాంతంలో సుస్థిరతకు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రాశ్చంలో అనేక ప్రయోజనాలు కలిగివున్న మాకు అక్కడ శాంతి నెలకొనడం చాలా అవసరం" అని జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లాహ్ బాబర్ పేర్కొన్నారు. పాక్ అధ్యక్షుడు శాంతి నెలకొల్పడానికి చొరవచూపుతున్నారని బాబర్ తెలిపారు.
సౌదీ అరేబియా, ఇరాన్ సంబంధాల పునరుద్ధరణలో అనేక సంక్లిష్టాలు నెలకొనియున్నాయి. అయితే వాస్తవికంగా ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని జర్దారీ అన్నారు. బహ్రైయిన్‌లో ఇరాన్ జోక్యం చేసుకోకుండా ఉండటం జర్దారీ చేసిన ప్రతిపాదనల్లో ఒకటి. రియాద్, టెహ్రాన్, మెజారిటీ షియా కమ్యూనిటీ నేరుగా చర్చలు జరుపుతున్నట్లు ఇస్లామాబాద్ నుంచి వెలువడే స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. జర్దారీ చేసిన మరో ప్రతిపాదన ప్రకారం యెమన్, సిరియాల్లో సుస్థిరత కోసం ఇరాన్ సహాయం చేస్తుంది.