హైతీ పౌరులతో వెళుతున్న బోటు ఒకటి టర్కీ, కైకస్ ద్వీపాల్లో తిరిగబడి మునిగిపోవడంతో అందులోని 85 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారు. అమెరికా తీరప్రాంత భద్రతా దళం మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. హైతీ నుంచి అక్రమ వలసదారులతో వెళుతున్న బోటు సముద్రంలో ఒక బండరాయిని ఢీకొనడంతో తిరగబడింది.
అనంతరం అది మునిగిపోయిందని, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన ప్రయాణికుడొకరు చెప్పారు.
సహాయకబృందాలు ఇప్పటివరకు 113 మంది ప్రయాణికులను రక్షించాయి. వీరందరూ బోటు మునిగిన అనంతరం సముద్రంలో పెద్ద కొండరాళ్లపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరి మృతదేహాలను కూడా సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 85 మంది ఆచూకీ తెలియరాలేదు.