వాయువ్య పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల దాటికి 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కౌంటర్ టెర్రరిజం అధికారులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఆఫీసు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న తల్లీ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ అహ్మద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ ఘటనను ఆయన తొలుత ఆత్మాహుతి దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత సోమవారం రాత్రి మరో ట్వీట్ చేస్తూ, ఈ పేలుళ్లకు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారని చెప్పారు.
ఇదిలావుంటే స్వాత్ లోయతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు గతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల ఆధీనంలో ఉండేది. 2009లో మిలిటరీ ఆపరేషన్ నిర్వహించి ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ టెర్రరిజం కార్యాలయంతో పాటు ఆయుధగారాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు దీన్ని లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు సంభవించడం గమనార్హం.