అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం సృష్టించింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లోని క్రైస్తవ పాఠశాలలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉండే అబండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు మాడిసన్ పోలీస్ విభాగం సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఈ ఘటనపై మాడిసన్ పోలీసు చీఫ్ షాన్ బర్న్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ సంఘటనలో కనీసం ఐదుగురు చనిపోయారని తెలిపారు. ఈ ఘటనకు 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి కారణమైనట్లు గుర్తించామన్నారు. అలాగే గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు బర్న్స్ పేర్కొన్నారు. ఈ ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇక ఈ ఘటన నేపథ్యంలో మరోసారి అమెరికాలో తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో పాఠశాలలో కాల్పుల సంఖ్య పెరిగింది. కే-12 స్కూల్ షూటింగ్ డేటాబేస్ వెబ్‌సైట్ ప్రకారం.. అమెరికాలో ఈ యేడాది 322 పాఠశాలలో కాల్పులు చేసుకున్నాయి. 1966 నుంచి ఏ సంవత్సరంలోనైనా ఇది రెండవ అత్యధికం. గతేడాది మొత్తం 349 కాల్పులతో అగ్రస్థానంలో ఉంది.