ఉత్తర ఇరాక్‌లో శనివారం సంభవించిన ట్రక్కు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 55కు చేరుకుంది. అలాగే గాయపడిన వారి సంఖ్య 200కు చేరుకుంది. ఈనెల 30వ తేదీ నుంచి ఇరాక్‌లోని అమెరికా బలగాలు వైదొలగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పేలుడు జరగడం పలు అనుమానాలకు తెరలేపుతోంది.
కుర్కుక్ నగరానికి సమీపంలోని ఒక మసీదులో ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈ శక్తివంతమైన పేలుడు సంభవించింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. అలాగే, పేలుడు ధాటికి సమీపంలోని ఎనిమిది ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అపారమైన ఇంధన వనరులు ఉన్న ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు అటు కుర్దులు, ఇటు అరబ్‌లు, తుర్కుమెన్‌లు పోటీ పడుతున్నారు.
దీంతో అమెరికా సైనికులు ఇక్కడ తిష్టవేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాయి. ఈనెలాఖరులో అమెరికా సైనికులు ఇక్కడ నుంచి వైదొలగితే ఇక్కడ తెగల పోరాటాలు ఆరంభమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.