థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి కడుపులో టేప్ వర్మ పురుగులు.. ఎంత పొడవో తెలుసా?

శుక్రవారం, 26 మార్చి 2021 (15:17 IST)
థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి కడుపులో టేప్ వర్మ్ పురుగులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే దాన్ని వెలికి తీయగా అది ఏకంగా 59 అడుగుల పొడుగు ఉండటం చూసిన డాక్టర్లే షాక్ అయ్యారు. కడుపులో ఉన్న పురుగు పెద్దదనే అనుకున్నారు గానీ మరీ అంత పొడుగు ఉంటుందని ఊహించలేదు.
 
వివరాల్లోకి వెళితే.. థాయ్‌ల్యాండ్‌లోని స్థానిక నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లోని ఓ ఆసుపత్రికి ఓ 67 ఏళ్ల వృద్ధుడు కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చాడు. అలాగే ఆపానవాయువు సమస్యతో కూడా సతమతమవుతున్నాడని చెప్పాడు. దీంతో డాక్టర్లు అతడి మలాన్ని పరీక్షల కోసం పంపించారు. 
 
ఆ పరీక్షల్లో అతడు టేప్ వర్మ్ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అతడి మలంలో దాదాపు 28 గుడ్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. డాక్టర్లు అతడికి నులిపురుగులను పోగొట్టే మందును ఇచ్చారు. దీంతో అతడి మలద్వారంగుండా ఈ టేప్ వర్మ్ బయటకొచ్చింది.
 
మొదట ఏదో చిన్నదిగా ఉంటుందని బయటకు లాగగా అదికాస్తా చాంతాండంత ఉండటంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు. లాగే కొద్దీ అది వస్తూనే ఉంది. లాగే కొద్దీ వస్తుండడంతో డాక్టర్లకు మతిపోయింది. చివరకు మొత్తంగా 18 మీటర్లు(59 అడుగులు) పొడవున్న టేప్ వర్మ్‌ను అతడి మలద్వారం గుండా బయటకు తీశారు.
 
ఈ విషయాన్ని ఆ ఆసుపత్రిలోని పారాసైటిక్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది వెల్లడించారు. ముక్కలుముక్కులుగా ఆ పురుగును బయటకు తీశామని, మొత్తం తీసిన తర్వాత దాని పొడవును కొలిస్తే ఏకంగా 59 అడుగులున్నట్లు తేలిందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు