సీల్స్‌లో సాధారణంగా మగజీవి 150 నుంచి 300 కిలోల బరువుతో రెండున్నర మీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఆదేవిధంగా ఆడ జీవి 100 నుంచి 200 కిలోల బరువుతో రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. వీటి దేహం కింద ఉదర భాగంలో ముందువైపు ఒక జత పూర్వాంగాలు, వెనుకవైపు ఒక జత చరమాంగాలు ఉంటాయి.
అయితే, నీటిలో ఈదడానికి తోడ్పడే ఈ తెడ్లలాంటి నిర్మాణాల్లో పూర్వాంగాలను గ్రే సీల్స్ చేతుల్లా ఉపయోగించి చప్పట్లు కొడుతాయట. సాధారణంగా జంతుప్రదర్శన శాలల్లోని నీటిలో ఉండే సీల్స్ కూడా చప్పట్లు కొడుతాయి. అయితే సందర్శకుల ఆనందం కోసం జూ నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో వాటికి ఆ చప్పట్లు కొట్టడం అనే లక్షణం ఒంటబడుతుంది. కాబట్టి అందులో వింతేమీ లేదు.
కానీ సముద్రాల్లోని గ్రే సీల్స్‌కు ఎలాంటి శిక్షణ లేకపోయినా చప్పట్లు కొడుతాయి. అదీ నీటి లోపలిభాగంలో ఎలాంటి గాలి లేకపోయినా, తుపాకీ పేలినంత పెద్దగా శబ్దం వచ్చేలా చప్పట్లు కొడుతాయట. సాధారణంగా కమ్యూనికేషన్ కోసం సీల్స్ రకరకాల శబ్దాలు చేస్తాయట.