తుపాకీలు చూపెట్టి నేరాలకు పాల్పడే దుండగుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే చోరీకి వచ్చిన ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గన్ పెట్టి ఓ షాపులోని క్యాషియర్‌ను బెదిరించిన దొంగకు మైండ్ బ్లాక్ అయ్యింది. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టినా డబ్బులివ్వకపోవడంతో పాటు దొంగ ముఖాన్నే అలానే చూస్తూ నిల్చుండిపోవడంతో విసుగెత్తిన దొంగ అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... ఫ్లోరిడాలోని ఓ దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. కొన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తీసుకుని క్యాషియర్ దగ్గరకు వెళ్లాడు. క్యాషియర్ ఆ వస్తువులకు బిల్ చేస్తుండగా దొంగ తన జేబు నుంచి తుపాకీ తీసి.. గురిపెట్టాడు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా భయపడటం, అరవడం చేస్తుంటారు. లేకుంటే దొంగ అడిగిన మొత్తాన్ని ఇచ్చేస్తుంటారు. కానీ ఈ క్యాషియర్ మాత్రం ధైర్యంగా నిలిచాడు.
ఆ వ్యక్తి తీసుకున్న వస్తువుల్ని కవర్లో పెట్టి అతడికి ఇచ్చేయడం చేశాడు. కామ్‌గా ఏమీ చేయకుండా క్యాషియర్ నిలిచిపోయాడు. దాదాపు 15 సెకన్లపాటు అక్కడే నిల్చున్న దొంగ.. ఇక లాభం లేదనుకుని తన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను స్థానిక పోలీసులు యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.