శాన్‌డియాగో: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆ దేశ సైన్యాన్ని చూసి చాలా దేశాలు గడగడలాడతాయి. అలాంటి అమెరికాలో దాదాపు 1,60,000 మంది సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారంటే నమ్మగలరా..? ఆశ్చర్యమనిపించొచ్చు. కానీ ఇది చేదు నిజం అంటోంది ఫీడింగ్ అమెరికా సంస్థ.
ఈ కఠిన వాస్తవం సాధారణ అమెరికన్లకు తెలియకపోవచ్చు. సైన్యంలో చాలా మందికి తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంలో మేం సభ్యులం. మా కుటుంబాలకు మాత్రం తిండి దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటంపై వారెలా దృష్టి పెట్టగలరు అని ఇరాక్ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన బ్లాక్‌హాక్ పైలట్ టేమీ డక్‌వర్త్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉందని సెయింట్ లూయిస్‌లో ఫుడ్‌బ్యాంక్‌ను నిర్వహించే నాప్ తెలిపారు. కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే తన కుటుంబంతో బతకడానికి సిద్ధమైన యువ సైనికాధికారి గురించి తనకు తెలుసని ఆమె చెప్పారు.