కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. ఏపీ సర్కారు నిర్ణయం
మంగళవారం, 26 అక్టోబరు 2021 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
కోవిడ్ 19 మూలంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం వర్తింపజేయనుంది. దరఖాస్తు నమునాను కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆయా జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచనలు చేస్తున్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఏర్పాటుచేశారు. దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తికి ఆదేశాలు జారీ అయ్యాయి. దరఖాస్తు కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించింది.