భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

ఐవీఆర్

ఆదివారం, 25 మే 2025 (21:34 IST)
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక జర్నలిస్టుని అతడి భార్య, పిల్లలు ముందే చంపేసారు. అతడిని శనివారం గుర్తు తెలియని ముష్కరులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవడంతో హత్య చేసారు. బలూచ్ కమ్యూనిటీకి చెందిన జర్నలిస్ట్ అబ్దుల్ లతీఫ్‌ను అతని భార్య, పిల్లల ముందే కాల్చి చంపారని బలూచ్ యక్జెహ్తి కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. లతీఫ్ డైలీ ఇంతిఖాబ్, ఆజ్ న్యూస్ ఛానళ్లలో పనిచేశాడు. అంతేకాదు యుద్ధంలో దెబ్బతిన్న ప్రావిన్స్‌లోని మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిఘటనపై నిర్భయంగా నివేదించడంలో ఆయనకు మంచి పేరున్నది.
 
ముష్కరులు అతని ఇంట్లోకి ప్రవేశించి అతడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, అతడు ప్రతిఘటించడంతో జర్నలిస్టును కాల్చి చంపేసారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హత్య చేసిన దుండగులు తప్పించుకున్నారు, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదనీ, హత్యపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే లతీఫ్ పెద్ద కుమారుడు సైఫ్ బలూచ్, మరో ఏడుగురు కుటుంబ సభ్యులు కూడా కొన్ని నెలల క్రితం కిడ్నాప్ చేయబడ్డారు, తరువాత వారి శవాలు లభ్యమయ్యాయి.
 
ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, ఇది మొత్తం బలూచ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఉద్దేశించిన ఉగ్రవాద చర్య అని బలూచ్ యాక్జెహ్తి కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్‌తో సహా అనేక జర్నలిస్ట్ సంస్థలు లతీఫ్ హత్యను ఖండించాయి. ఈ సంఘటనను సమస్యాత్మక ప్రావిన్స్‌లోని జర్నలిస్టులు, కార్యకర్తలు, మేధావులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేస్తున్న 'కిల్ అండ్ డంప్' ప్రచారంలో భాగంగా చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు