లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం రాత్రి భారీ విస్ఫోటనం సంభవించింది. మొత్తం 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ధాటికి వంద మంది చనిపోగా, బహుళ అంతస్తు భవనాలన్నీ ధ్వంసమైపోయాయి. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొల్పింది. దీంతో ప్రజలంతా నగరాన్ని వీడి వెళ్లిపోయారు. ఫలితంగా బీరూట్ నగరం ఇపుడు శ్మశానాన్ని తలపిస్తోంది.
మంగళవారం రాత్రి మొత్తం 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు జరిగింది. భారీ విస్ఫోటనం సంభవించిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. వేలాది భవనాలు తీవ్రంగా దెబ్బతినగా, ప్రజలు మొత్తం నగరాన్ని వీడి వెళ్లిపోయారు. ముఖ్యంగా పోర్ట్ ప్రాంతంలో జనసంచారం కనిపించని పరిస్థితి నెలకొంది.
రోడ్లన్నీ గాజు పెంకులు, ఇనుప ఊచలు, భవన వ్యర్థాలతో నిండిపోయాయి. బహుళ అంతస్తుల భవంతులన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరోవైపు, పేలుడు తర్వాత గాల్లోకి విషవాయువులు వ్యాపించడంతో, దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం ఉండటంతోనే ప్రజలంతా తమతమ నివాసాలను విడిచి వెళ్లిపోయారు.