బ్రెజిల్‌లో సామాజిక సంక్రమణ : అధ్యక్షుడుకి కరోనా పాజిటివ్

బుధవారం, 8 జులై 2020 (06:37 IST)
కరోనా వైరస్ మహమ్మారిని తక్కువ చేసి మాట్లాడి, మాస్కులు ఎందుకంటూ న్యాయస్థానాన్ని ఆక్షేపించిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్  బోల్సొనారో చివరకు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా, బ్రెజిల్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడ సామాజిక సంక్రమణ మొదలైంది. ఫలితంగా బ్రెజిల్‌లో కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కూడా కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయనకు గత రెండు పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా, మూడో పరీక్షలో పాజిటివ్ అని తేలింది. బ్రెజిల్‌లో ఇప్పటికే కరోనా వ్యాప్తి సామాజిక సంక్రమణం దశలో ప్రమాదకర స్థాయికి చేరింది. 
 
అమెరికా తర్వాత ప్రపంచంలో బ్రెజిల్‌లోనే అత్యధిక కేసులున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 16 లక్షల మందికి పైగా కరోనా బారినపడ్డారు. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్న తరుణంలో అధ్యక్షుడు బోల్సొనారో వ్యవహార శైలి తీవ్ర విమర్శలపాలైంది. 
 
దేశాధ్యక్షుడైనా సరే కరోనా నివారణ కోసం మాస్కు ధరించాలని న్యాయస్థానం పేర్కొన్నా, అవన్నీ అర్థం లేనివి అంటూ బోల్సొనారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరచుగా కరోనా టెస్టులు చేయించుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు