భారత్‌కు డ్రాగన్ కంట్రీ చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్‌లో ఉన్న భూతల స్వర్గం కాశ్మీర్‌ను కైవసం చేసుకుంటామని హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణం... టిబెట్ ఆథ్యాత్మిక మతగురువు దలైలామాను తాము వద్దంటున్నా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వేర్పాటువాదుల దుశ్చర్యలతో కాశ్మీర్ ఇప్పటికే కల్లోలంగా మారిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో దలైలామా అరుణాచల్‌లో అడుగుపెట్టకుండా సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసిన చైనా... ఆయన పర్యటనను ఆపకపోతే 'కల్లోల' కాశ్మీర్ విషయంలో తాము కలుగజేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈమేరకు చైనా అధికారిక మీడియాలో ప్రత్యేక కథనం ప్రచురించింది. దలైలామాను ఆహ్వానించాలన్న భారత నిర్ణయం 'మతిలేని చర్య... అనాగరికం..' అంటూ విపరీత వ్యాఖ్యలు చేసింది.
కాగా, బుధవారం భారత దౌత్యాధికారి వీకే గోఖలేకు సమన్లు ఇచ్చి తీవ్ర నిరసన తెలిపింది. దలైలామా పర్యటనను వెంటనే రద్దు చేయాలంటూ భారత్‌ను కోరిన మరుసటిరోజే మరింత అగ్గిరాజేయడం గమనార్హం. దలైలామా పర్యటన రాజకీయాలకు అతీతమైనదనీ.. కేవలం మతపరమైన వ్యవహారమైనందును ఆయన పర్యటనను అడ్డుకోబోమని భారత్ స్పష్టం చేసింది.