కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల్ని జలగల్లా పీల్చుకుంటున్న ఈ రోజుల్లో ఒక డాక్టర్ 28 గంటలపాటు నిర్విరామంగా ఐదుగురు రోగులకు ఆపరేషన్ చేయడమే కాకుండా మళ్లీ తన అవసరం ఉంటుందేమో అని ఆసుపత్రిలోనే నేలపై పడుకుంటే అతడిని ఏమని పిలవాలి. ప్రజావైద్యుడు అంటే ఈదేశంలో చాలామందికి దాని అర్థం తెలియకపోవచ్చు కానీ మా దేశంలో ఇలాంటివి మామూలే అంటున్నారు చైనా దేశీయులు. కాని అలా ఆసుపత్రిలోనే నిద్రించిన ఆ చైనా వైద్యుడు నెటిజన్లకు నిజమైన హీరోగా మారిపోయారు.
ఫేస్బుక్లో ఒక ఫోటో ఇప్పుడు వైరల్గా మారి చూసిన వారందరి హృదయాలనూ గెల్చుకుంటోంది. ఈ ఘనత సాధించిన వారు చైనాకు చెందిన లుయో హెంగ్ అనే వైద్యుడు. రాత్రిపూట అత్యవసరంగా రెండు శస్త్ర చికిత్సలు చేయవలసివచ్చిన ఆయనకు నిద్ర కరువైంది. చికిత్సలు పూర్తయ్యాక మళ్లీ మరో మూడు శస్త్ర చికిత్సలు చేయవలసి రావడంతో ఆ వైద్యుడు ఇంటికి కూడా వెళ్లకుండా ఆస్పత్రిలోనే 28 గంటలు నిర్విరామంగా ఐదుగురు రోగులకు శస్త్ర చికిత్స చేశారు.
అప్పటికి పూర్తిగా అలసిపోయిన ఆ డాక్టర్ ఇంకా తన అవసం ఉంటుందేమో అని ఆలోచించి ఆసుపత్రిలోనే నేలపై పడుకున్నారు. మార్చి 30న జరిగిన ఈ ఘటనను చైనాకు చెందిన గ్లోబల్ టీవీ నెట్ వర్గ్ ఫేస్బుక్ ద్వారా తెలుపుతూ ఆ వైద్యుడు ఆసుపత్రిలో నిద్రపోతుండగా తీసిన ఫోటోను పోస్ట్ చేసింది. ఆ పోటో ఇప్పుడు నెటిజన్లను చలింపచేస్తోంది. ఈ వైద్యుడే మనకాలపు కథానాయకుడు అని ప్రశంసల జల్లు కురిపిస్తూనే అన్ని గంటలు పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు.
ఒక తెలుగు సినిమాలో వీడు సామాన్యుడు కాడు అనే డైలాగ్ ఉంది. పోలిక అనవసరమే కానీ.. అపర ధన్వంతరి, వైద్యో నారాయణో హరి.. వంటి పదాలన్నీ కూడా కలపోసి పొగిడినా ఈ డాక్టర్ పాటించిన వృత్తి నిబద్ధతకు సరి తూగవేమో మరి.