కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనుంది.. ఐరాస

గురువారం, 18 మార్చి 2021 (15:18 IST)
corona
చైనాలోని వుహన్ నగరంలో తొలుత బయటపడిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11.95కోట్లు దాటింది. మరణాల సంఖ్య 26.50లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06కోట్లకు పైగా ఉన్నాయి. 
 
వ్యాక్సిన్ వచ్చినప్పటికి కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమైన విషయం. కొత్త రూపాల్లో కోవిడ్ విజృంభిస్తోంది. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.
 
కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనున్నదని ప్రకటించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది.
 
శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్‌-19 సీజనల్‌ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు