రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అవకాశం : శ్రీలంక ఆర్మీ చీఫ్

ఆదివారం, 10 జులై 2022 (11:55 IST)
ప్రస్తుతం తమ దేశంలో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు మంచి అవకాశం లభించిందని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర సిల్వా అన్నారు. అయితే, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజలు మద్దతు ఎంతో అవసరమన్నారు. సైన్యం, పోలీసులకు సహకరించి శాంతి నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
 
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాందోళనలు శనివారం పతాకస్థాయికి చేరుకున్నాయి. రాజధాని కొలంబో వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లారు. ముంచుకొస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అక్కడి నుంచి శుక్రవారం రాత్రే పరారయ్యారు. 
 
ఈ నిరసన సెగల్ని తట్టుకోలేక.. ఎట్టకేలకు బుధవారం (ఈనెల 13వ తేదీ) గద్దె దిగేందుకు అంగీకరించారు. గొటబాయ రాజపక్స నియమించిన ప్రధాని విక్రమసింఘే కూడా పదవికి రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించారు. 
 
అయినప్పటికీ శాంతించని ఆందోళనకారులు విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పుపెట్టారు. ఇన్ని ఆందోళనల నడుమ చివరికి దేశంలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం గొటబాయ ఎక్కడున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు