యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మద్దతు ఇస్తోన్నట్లుగా అనుమానిస్తోన్న హౌతీ తిరుగుబాటుదారులు.. అరబ్ ఎమిరేట్స్‌పై బాంబు దాడికి పాల్పడ్డారు. డ్రోన్లతో వరుసగా బాంబులను విసిరారు. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగించారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ దేశస్తుడు దుర్మరణం పాలయ్యారు.
ఈ విషయాన్ని అబుధాబి పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడింది హౌతీ తిరుగుబాటుదారులేనని నిర్ధారించారు. ఈ దాడి తరువాత ఒక్కసారిగా మధ్య-తూర్పు ఆసియా దేశాల్లో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరబ్ ఎమిరేట్స్‌కు సౌదీ అరేబియా అండగా నిలిచింది. హౌతీ తిరుగుబాటుదారులను అణచి వేయడానికి రంగంలోకి దిగింది. యెమెన్‌పై వైమానిక దాడులు చేసింది.