అమెరికాలోని భారతీయుల మెడపై బహిష్కరణ కత్తి వేలాడుతోంది. దీంతో 20 వేల మంది భారతీయులు గత్యంతరంలేని పరిస్థితుల్లో అమెరికాను వీడాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడనుంది. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయమే. అమెరికాలోకి బాల్యంలో చట్ట విరుద్ధంగా ప్రవేశించి (తల్లిదండ్రుల ద్వారా), అక్కడ చదువుకుని, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి తీవ్ర హాని కలిగించే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్ (డీఏసీఏ) ప్రోగ్రామ్‌ను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఆయన మంగళవారం సంతకం చేశారు. ఫలితంగా సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దుచేశారు.
దీంతో అమెరికాలో ఉన్న లక్షలాది మందికి డిపోర్టేషన్ (బహిష్కరణ) భయం పట్టుకుంది. ట్రంప్ తీసుకోనున్న నిర్ణయం 20 వేల మందికి పైగా భారతీయులపై పడనుందని 'సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్' సంస్థ అంచనా వేసింది. ట్రంప్ నిర్ణయంతో 5,500 మంది భారతీయులు, పాకిస్థానీలు డీఏసీఏను పొందారు. వీరంతా త్వరలోనే దేశ బహిష్కరణకు గురికానున్నారు. వీరికితోడు 17వేల మంది భారతీయులు, 6 వేల మంది పాకిస్థానీలు డీఏసీఏకు అర్హులు. ఈ తరుణంలో డీఏసీఏ నిషేధంతో వీరంతా బహిష్కరణకు గురికానున్నారు.
గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే డీఏసీఏను రద్దు చేస్తానని ట్రంప్ హామీనిచ్చారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను రద్దు చేసి, వారిని స్వదేశాలకు పంపాలని రెండేళ్ల క్రితమే డిమాండ్ మొదలైంది. డ్రీమర్ల వల్ల స్థానిక అమెరికన్ల ఉపాధికి ప్రమాదమని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలా పాల్లో పాల్గొంటున్నారని ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. ఈ వలసదారుల్లో ఎక్కువమంది పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందినవారే. భారత్, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన యువత తొమ్మిది శాతం వరకూ ఉండొచ్చని అంచనా.