సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో.. వివాదాస్పద చర్యల్లో ముందుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైనట్లు ట్రంప్ ఆరోపిస్తున్న తరుణంలో.. నెల రోజుల క్రితమే డబ్ల్యూహెచ్‌వోకు నిధులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
అంతేగాకుండా.. చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తోలుబొమ్మలాగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వోలో సమూల మార్పులు జరగకుంటే, శాశ్వతంగా ఆ సంస్థకు నిధులను నిలిపివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోకు బదులుగా, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యపరంగా అత్యవసరమైన దేశాలకు ఆ నిధులను మళ్లించనున్నట్లు ఆయన చెప్పారు.
కరోనా వైరస్ పట్ల చైనా నుంచి సమాధానం కావాలని ప్రపంచదేశాలు ఆశిస్తున్నాయని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ట్రంప్ అన్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, కావాల్సిన సంస్కరణలను డబ్ల్యూహెచ్‌వో చేపట్టలేదని ట్రంప్ విమర్శలు గుప్పించారు. అందుకే.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాలకు స్వస్తి చెప్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.