ఈ పర్యటనలో మొదటి రోజైన సోమవారం ఆయన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' అనే భారీ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారు. ఇటీవలే నిర్మితమైన ఈ క్రికెట్ స్టేడియం సామర్థ్యం లక్ష మంది కావడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.
ఆ తర్వాత సోమవారం సాయం సంధ్య వేళలో డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రా వెళ్తారు. అక్కడి ప్రేమ సౌథం తాజ్ మహల్ అందాలను ఆస్వాదిస్తారు. ఈ ప్రేమ సౌథం వద్ద ఆత్మీయానురాగాలను పంచుకోవాలనే అభిలాష చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా విదేశీ ప్రతినిథులు కూడా చాలా మంది ఇక్కడ ఫొటోలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
మంగళవారం ఉదయం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే స్వాగత కార్యక్రమానికి ట్రంప్ దంపతులు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌లోని రాజ ప్రాసాదంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారక కేంద్రాన్ని సందర్శించి, ఆయనకు నివాళులర్పిస్తారు.