Drama and Lies: పాక్ ప్రధాని డ్రామాలొద్దు.. అద్దంలో చూసుకుంటే నిజ స్వరూపం తెలిసిపోద్ది.. భారత్ ఫైర్

సెల్వి

శనివారం, 27 సెప్టెంబరు 2025 (11:10 IST)
Petal Gahlot
ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్‌-పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే గొప్పలు చెప్పుకోగా దీనికి పాకిస్థాన్‌ ప్రధాని కూడా తోడయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్‌తో భేటీ తర్వాత కాల్పుల విరమణపై ఆయన చేస్తున్న మాటలకు వత్తాసు పలికారు. 
 
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా ఆరోపించారు. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని, ఇది యుద్ధ చర్యకు సమానమని అన్నారు. కాశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు సిద్ధమని షరీఫ్‌ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక ఘర్షణను ఆపాలంటూ పాకిస్థాన్ తమను ప్రాధేయపడిందని న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) 80వ సెషన్‌ వేదికగా భారత్ వెల్లడించింది. భారత్, పాక్‌లకు సంబంధించిన ఏ వ్యవహారంలోనైనా మూడో పక్షం జోక్యానికి అవకాశమే ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. 
 
ఐరాసలో భారత్ శాశ్వత మిషన్‌ ప్రథమ కార్యదర్శి పెటల్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రమూకలు దాడి చేసినందుకే, భారత్ ఆపరేషన్ సిందూర్​ను నిర్వహించిందని ఆమె తేల్చి చెప్పారు. ఎవరైనా దాడి చేస్తే, బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందన్నారు. దాన్నే తమ సైన్యం వినియోగించుకుందని పేర్కొన్నారు.
 
పాక్ ప్రధాని డ్రామాలతో వాస్తవాలను దాచిపెట్టలేరన్నారు. జమ్ముకాశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టన్స్ ఫ్రంట్‌కు వత్తాసు పలుకుతూ పాక్ ప్రధాని మాట్లాడారని ఆమె మండిపడ్డారు. ఆ సంస్థ ఉగ్రవాదులే భారతీయ టూరిస్టులను దారుణంగా చంపారని గుర్తు చేశారు.
 
భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని అంటున్నారు. ఈ విషయంలో ఆయన నిజంగా సిన్సియర్‌గా ఉంటే, ఒక స్పష్టమైన దారి ఉంది. వెంటనే ఉగ్రవాద శిబిరాలన్నీ పాక్ మూసేయాలి. వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలి. 
 
ద్వేషం, మతోన్మాదం, అసహనంలకు నిలయంగా మారిన పాక్‌, ఐరాస జనరల్ అసెంబ్లీలో మతవిశ్వాసాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాజకీయ, ప్రజా సంబంధ అంశాల్లో పాకిస్థాన్ నిజస్వరూపం అందరికీ తెలిసిపోతోంది. అద్దంలో చూసుకుంటే, నిజస్వరూపం పాకిస్థాన్‌కు కూడా కనిపిస్తుంది. 
 
ఉగ్రవాదులు, వారిని ప్రేరేపించే వాళ్లు సరిసమానం. వాళ్లిద్దరూ ఉగ్రవాదానికి బాధ్యులే. న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్‌తో ఉగ్రవాదాన్ని కొనసాగించే అవకాశాన్ని మేం ఇవ్వం. ఉగ్రవాదాన్ని భారత్ అస్సలు ఉపేక్షించదు... అని పెటల్ గెహ్లాట్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు