ఆ దంపతులు ఆరు దశాబ్దాలుగా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. జీవిత పయనంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ.. వారు కలిసే పంచుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అందుకే వయసు పెరుగుతుండటంతో వారికి తీవ్ర ఆరోగ్యం బారినపడక ముందే ఇద్దరూ కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. తమకు కారణ్య మరణాన్ని ప్రసాదించాలన్న ఆ దంపతుల కోరిక మేరకు.. ప్రభుత్వం సమ్మతించడంతో వారిద్దరూ ఒకేసారి కన్నుమూశారు.
నెదర్లాండ్స్‌కు చెందిన నిక్, ట్రీస్ వృద్ధ జంట 65 ఏళ్లు కాపురం చేశారు. వారి వయసు 91 యేళ్లు. వయసు పెరుగుతుండటంతో వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చాయి. 2012లో నిక్‌కి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఈ మధ్య ట్రీస్‌కు కూడా డిమెన్షియా ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లిద్దరూ వ్యాధులతో ఎక్కువ కాలం ఇబ్బంది పడకుండా, కలిసి కన్నుమూయాలని నిశ్చయించుకున్నారు.
అందుకోసం కారుణ్య మరణం కోసం నెదర్లాండ్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సంవత్సరం విచారణ తర్వాత వీరి జంట కారుణ్య మరణానికి ప్రభుత్వానుమతి లభించింది. జూలై 4న చేతులు కలుపుకుని, పక్కపక్కనే పడుకుని, డాక్టర్ల ఇచ్చిన మందు తీసుకుని ఒకేసారి ఈ జంట కన్నుమూసింది. కలిసి చనిపోవాలనే వారి చివరి కోరికను సాకారం చేసినందుకు వారి పిల్లలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, నెదర్లాండ్స్ చట్టాల ప్రకారం తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, బెల్జియం, కొలంబియా, లక్జెంబర్గ్ వంటి ఇతర దేశాల్లో కూడా కారుణ్య మరణాన్ని చట్టరీత్యా అంగీకరిస్తారు. వైద్యులు ఇచ్చే మందును స్వీకరించి భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మృత్యుఒడిలోకి చేరుకుంటారు.