కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూసుకున్న యూరోపియన్ యూనియన్ సరిహద్దులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. అయితే, కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తుండటంతో అమెరికాకు మాత్రం యూరోపియన్ యూనియన్ అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం సరిహద్దులు తెరుచుకోవడంతో జూలై 1 నుంచి 15 దేశాలవాసులు వచ్చి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది.
ప్రతి రెండు వారాలకూ ఈ జాబితాను సవరిస్తుంటామని, చైనా సైతం ఇదే విధానాన్ని అవలంభించనుందని ఈయూ ఓ ప్రకటనలో పేర్కొంది. యూఎస్‌కు పొరుగు రాష్ట్రమైన కెనడా సహా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉరుగ్వే తదితర దేశాలకు చెందినవారు ఏ విధమైన ఆంక్షలు లేకుండా యూరప్ దేశాల్లో పర్యటించవచ్చని పేర్కొంది.
అయితే, వారికి తుది అనుమతులు తప్పనిసరని పేర్కొంది. అల్జీరియా, జార్జియా, జపాన్, మాంటెనీగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, సౌత్ కొరియా, థాయ్ ల్యాండ్, ట్యునీషియా దేశాల వారికి కూడా ప్రయాణాలకు అనుమతి లభించింది.
మార్చి మూడో వారం నుంచి అత్యవసర పనుల నిమిత్తం మినహా మిగతా అన్ని రకాలైన ప్రయాణాలనూ ఈయూ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, సభ్య దేశాల నడుమ, దేశాల సరిహద్దులు ఆయా దేశాల నిర్ణయానుసారం తెరచుకోవచ్చని ఈయూ పేర్కొంది.