అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఏమాత్రం మానవత్వం లేకుండా నడుచుకున్నారు. తమ విమానంలో ఎక్కిన ఓ చిన్నారి.. ముఖానికి మాస్క్ ధరించేందుకు మారాం చేసింది. ఎంత బ్రతిమిలాడినా ఆ చిన్నారి మాస్క్ ధరించలేదు. దీంతో విమాన సిబ్బంది వారిని నిర్ధాక్షిణ్యంగా కిందికి దించేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన సిబ్బంది అనుచిత ప్రవర్తనను నెటిజన్లు తూర్పారబడుతున్నారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఇంత ఘోరంగా నడుచుకుంటారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను పరిశీలిస్తే, ఎలిజ్ అర్భన్ అనే యువతి, తన భర్త, రెండు సంవత్సరాల బిడ్డతో కలిసి యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేందుకు విమానం ఎక్కింది. ఆపై విమానంలో తాము అత్యంత అవమానాన్ని ఎదుర్కొన్నామని, ఏ మాత్రం కనికరం లేకుండా తమను బలవంతంగా దించేశారని, ఆపై జీవితాంతం తాము యునైటెడ్ ఎయిర్ లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించారని ఎలిజ్ కన్నీరు పెట్టుకుంటూ, విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
విమానంలో మాస్క్ పెట్టుకోవాలన్న నిబంధన ఉండగా, రెండేళ్ల పాప, తనకు మాస్క్ వద్దని మారాం చేసింది. పాప తండ్రి ఎంతగా బలవంతం చేసినా, ఆ బిడ్డ వినలేదు. ఇంతలో విమానం సిబ్బంది వచ్చి, పాపను తీసుకుని కిందకు దిగాలని సూచించాడు. తాను బిడ్డ ముఖంపై మాస్క్‌ను ఉంచానని, పాప కొంత మారాం చేస్తుందని, కాసేపట్లో సర్దుకుంటుందని చెప్పి చూశాడు.