చీజ్‌బర్గర్ ఒక సోదరుడి ప్రాణాలు తీసిందంటే నమ్ముతారా? అవును నిజమే బర్గర్ ఇవ్వలేదని క్షణికావేశంలో సహోదరుడినే అతికిరాతకంగా తుపాకీతో కాల్చిచంపాడో కిరాతకుడు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫోర్లిడాలోని సెయింట్ క్లౌడ్ నగరంలో నివసించే బెంజమిన్, నికోలస్ మిద్దెన్‌డార్ఫ్‌లు ఇద్దరు అన్నదమ్ములు.
గురువారం రాత్రి బయట నుంచి ఇంటికి వచ్చిన బెంజమిన్ తన సోదరుడిని చీజ్‌బర్గర్ ఇవ్వమని అడిగాడు. అతడు ససేమిరా కుదరదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ పెద్ద ఘర్షణకు దారితీసింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న బెంజమిన్ తన సోదరుడైన నికోలస్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దిగడంతో నికోలస్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.