బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారోకు చేదు అనుభవం.. వీధిలో పిజ్జాలు తింటూ..

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:57 IST)
వ్యాక్సిన్‌ వేయించుకోకపోవడం కూడా హీరోయిజంగా భావించిన బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారోకు చేదు అనుభవం ఎదురైంది. 'మీకు ఇక్కడ ప్రవేశం లేదు' అని ముఖం మీద కొట్టినట్లు న్యూయార్క్‌లోని రెస్టారెంట్‌ యజమానులు చెప్పడంతో ఆయన వీధిలో పిజ్జాలు తినాల్సివచ్చింది. జనరల్‌ అసెంబ్లీలో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వచ్చిన బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోమవారం రాత్రి ఎదురైన అనుభవం ఇది. 
 
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ లేనిదే నగరంలోని రెస్టారెంట్లలోకి రావడానికి ఆయనను అనుమతించలేదు. కరోనా వైరస్‌ రాకుండా తట్టుకునేంత రోగ నిరోధక శక్తి తనకు వుందని విర్రవీగిన బోల్సనారో ఈ అవమానాన్ని కూడా ఘనకార్యంగా చూపే ప్రయత్నం చేశారు. ఇక్కడకు రావడానికి ముందే అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని న్యూయార్క్‌ మేయర్‌ ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. 
 
అయితే, ప్రభుత్వ, దేశాధినేతలు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సిన అవసరం లేదని జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్‌ వివరణ ఇవ్వడంతో బోల్సనారో ఐరాసలో ప్రవేశానికి ఇబ్బందిలేక పోయింది. న్యూయార్క్‌ రెస్టారెంట్లు మాత్రం మేయర్‌ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు