నల్లుల సంఖ్య పెరిగిపోవడంతో.. ఫ్రాన్స్ ఏం చేసిందో తెలుసా?

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (13:52 IST)
bedbug
నల్లుల సంఖ్య పెరిగిపోవడంతో ఫ్రాన్స్ వాటిపై యుద్ధం ప్రకటించింది. పర్యాటకులను ఆకట్టుకునే ఫ్రాన్స్‌లో ఇటీవల నల్లుల కారణంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దేశంలో నల్లుల బాధ పోగొట్టేందుకు ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. నల్లులు చూడటానికి చిన్నగానే ఉన్నా.. మనుషులను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. సోఫాలు, పరుపుల్లో దాక్కుని.. మనుషుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. 
 
మంచంలో నల్లులు ఉన్నాయంటే నిద్ర సంగతిని పక్కనబెట్టి.. రక్తాన్నంతా దానికి అర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి కుడితే దురద, మంటతో చికాకు తప్పదు. ప్రస్తుతం ఆ నల్లులు ఫ్రాన్స్‌ దేశాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయట. దీంతో వీటిని ఎలాగైనా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం.. నల్లుల నిర్మూలనకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయనుంది.
 
రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఫ్రాన్స్‌ దేశంలో ప్రజలు పురుగుల మందు(డీడీటీ)ను అధిక సంఖ్యలో ఉపయోగించడం వల్ల నల్లులు దాదాపు కనుమరుగయ్యాయి. అయితే ఈ మధ్య డీడీటీ వినియోగంపై నిషేధం విధించడంతో మళ్లీ నల్లులు ప్రత్యక్షమవుతున్నాయి. 2018లో పారిస్‌లో నల్లులు అధికం కావడంతో వీటిపై యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
 
నల్లులను చంపే ప్రత్యేక దళాన్ని అక్కడి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో ప్రస్తుతం నల్లులపై ఆ దేశం యుద్ధం ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చింది. అత్యవసర నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా తమ ఇంట్లో నల్లులను గమనిస్తే.. వాటిని ఎలా నిర్మూలించాలి? తదితర వివరాలను నిపుణుల ద్వారా తెలుసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు