కాశ్మీర్‌లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు ఫ్రాన్స్‌లో సోమవారం సమావేశమయ్యారు. జీ7 సదస్సులో భాగంగా వారిద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
ఈ భేటీపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, గత రాత్రి కాశ్మీర్ అంశం గురించి చర్చించుకున్నట్లు చెప్పారు. కాశ్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని మోడీ చెప్పారనీ ట్రంప్ వెల్లడించారు. పాకిస్థాన్‌తోనూ మాట్లాడుతున్నాని, రెండు దేశాలు త్వరలోనే కాశ్మీర్ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పాక్, భారత్ మధ్య ఉన్న సమస్యలన్నీ ద్వైపాక్షికమే అని ప్రధాని మోడీ చెప్పారు. అందుకే ఈ అంశంలో ఇతర దేశాల జోక్యం గురించి పెద్దగా పట్టించుకోమని మోడీ అన్నారు. 1947 కన్నా ముందు భారత్, పాకిస్థాన్ దేశాలు కలిసే ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తు చేశారనీ ట్రంప్ వెల్లడించారు.
ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని ఇద్దరూ పరిష్కరించుకుంటామని మోడీ చెప్పారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే కాశ్మీర్ అంశంపై పాక్‌తో విబేధాలు ఉన్న నేపథ్యంలో ఆ అంశంపై మధ్యవర్తిత్వం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ ఇటీవల చెప్పిన విషయం కూడా తెలిసిందే.