హాయిగా నిద్రపోయే అలవాటు ఉందా? ఇదిగో ఓ బెస్ట్ ఆఫర్.. వేతనం రూ.11 లక్షలు... కండిషన్స్ అప్లై

బుధవారం, 5 ఏప్రియల్ 2017 (17:23 IST)
చాలా మంది ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా పడకెక్కుతారు. ఇంకొందరు పనీబాటలేకుండా హాయిగా నిద్రపోయేందుకే పుట్టామా? అన్న రీతిలో ఉంటారు. ఇలాంటివారికి ఓ కంపెనీ బెస్ట్ ఉద్యోగ ఆఫర్‌ను ప్రకటించింది. వారు చేయాల్సిందిల్లా రోజంతా నిద్రపోవడమే. నిద్రపోయినందుకు వేతనం కూడా చెల్లిస్తారు. అదీ కూడా రూ.లక్షల్లోనే సుమా. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫ్రాన్సిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నిద్రపోయే వారి కోసం వెదుకుతున్నారు. ఉద్యోగం పొందినవారు మూడు నెలలు నిద్రపోవాల్సి ఉంటుంది. ఇలా నిద్రపోయినందుకుగాను 16 వేల యూరోలు (దాదాపు 11.2 లక్షల రూపాయలు) చెల్లించనున్నారు.
 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో పునరుత్పత్తి‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో భాగంగా మూడు నెలలపాటు నిద్రించే వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ జాబ్ కోసం వచ్చేవారు పరిశోధన కోసం మూడు నెలల పాటు నిద్రపోవాలి. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 60 రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది. తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు. 
 
అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హతలతో పాటు.. నిబంధనలు విధించింది. పొగతాగడం అలవాటు లేని వారు, బాడీ మాస్ ఇండెక్స్ 22-27 మధ్య ఉండాల్సి ఉంటుంది. అలాగే, నిబంధనల్లో మొదటి నిబంధన ఏంటంటే... తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని ఆనుకుని ఉండాలి. ఈ 60 రోజులు తినడం, పడుకోవడం, వాషింగ్ వంటి నిత్యకృత్యాలు సాధారణమే. ఉద్యోగాన్ని ఆశించే పురుషులకు 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 

వెబ్దునియా పై చదవండి