ఉక్రెయిన్ - రష్యా దేశాల యుద్ధం - భారత్‌లో పెరగనున్న ధరలు

బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (14:14 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే దాని ప్రభావం భారత్‌పై పడనుంది. ఈ యుద్ధం కారణంగా మన దేశంలో అనేక వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు కొండెక్కనున్నాయి. 
 
ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న దౌత్య సంబంధాల కారణంగా ఉక్రెయిన్‌కు భారత్ ఔషధాలను భారీగా ఎగుమతి చేస్తుంది. ఆ దేశం నుంచి వంట నూనెలను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. అలాగే, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గ్యాస్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంది. 
 
ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థిలు ప్రభావం అంతర్జాతీయ సమాజంపై ఎక్కువగానే ఉంది. దూకుడు ప్రదర్శిస్తున్న రష్యాపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. 
 
ప్రస్తుతం చమురు బ్యారెల్ ధర 96.7 డాలర్లుగా ఉంటే, ఇది 105-110 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1000గా ఉంది. 
 
దీనిపై మరో వంద రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండింటిని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే, గోధుమల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా రష్యా ఉంది. 
 
ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. కనుక వంట నూనెలు కూడా ప్రభావితం కానున్నాయి. ఇంకా అల్యూమినియం, మెటల్స్ ధరలు కూడా పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు